ఉగ్రవాదులకు సాయపడుతూ, ఆశ్రయం కల్పించేవారిపై చర్యలు తీసుకోవాలి: రాజ్‌నాథ్ సింగ్

  • ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించే దేశాలు తగిన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిక
  • పహల్గామ్ ఉగ్రదాడి యావత్ మానవాళిని కుదిపేసిందని వ్యాఖ్య
  • ఉగ్రవాదంతో పలు సమస్యలు ఎదుర్కొంటున్నామన్న రాజ్‌నాథ్ సింగ్
ఉగ్రవాదులకు సాయపడుతూ, ఆశ్రయం కల్పించేవారిపై చర్యలు తీసుకోవడంలో షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) వెనుకాడకూడదని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించే దేశాలు అందుకు తగిన పరిణామాలను ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. కిర్గిస్థాన్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ రక్షణ మంత్రుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత సంవత్సరం జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి యావత్ మానవాళిని కుదిపేసిందని అన్నారు. ఆ తర్వాత భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టి, ఉగ్రవాదులు ఎక్కడున్నా తప్పించుకోలేరని నిరూపించిందని అన్నారు. ఉగ్రవాదం ప్రపంచానికి ప్రధాన సమస్యగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. తీవ్రవాదం, ఉగ్రవాదంతో పలు సమస్యలు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. ఉగ్రవాద బెదిరింపులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడానికి భారత్ సిద్ధంగా ఉందని అన్నారు.

ప్రభుత్వ మద్దతుతో జరిగి సీమాంతర ఉగ్రవాదాన్ని ఏమాత్రం ఉపేక్షించకూడదని ఈ సందర్భంగా కోరారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ద్వంద్వ ప్రమాణాలు ఉండకూడదని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదులకు సాయపడుతూ, ఆశ్రయం కల్పించేవారిపై చర్యలు తీసుకోవడంలో షాంఘై సహకార సంస్థ ముందుండాలని కోరారు. గత కొన్నేళ్లుగా జరుగుతున్న వరుస ఘర్షణల కారణంగా ఎంతోమంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని ఇటీవలి యుద్ధాలను ఉద్దేశించి అన్నారు.

Rajnath Singh
Union Minister Rajnath Singh
Rajnath Singh on Terrorism

More Telugu News